ఈషా రెబ్బా వాళ్ల సొంతూరు వరంగల్ జిల్లా హసన్‌పర్తి. వాళ్ల నాన్న ఉద్యోగ రీత్యా ఆమె పుట్టకముందే హైదరాబాద్ షిఫ్టయ్యారు. ఈషాకు అక్క షీలా, చైలి శైలా ఉన్నారు. నాన్న శంకర్ బీహెచ్ఈఎల్ ఉద్యోగి కావడంతో బీహెచ్ఈఎల్ కాలనీలో ఉండేవాళ్లు. సెయింట్ ఆన్స్ స్కూల్లో టెన్త్ క్లాస్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటరీ బైపీసీ చదివింది ఈషా. ఆ తర్వాత ఖైరతాబాద్‌లోని షాదన్ కాలేజీలో బీయస్సీ మైక్రోబయాలజీ చేశాక, మల్లారెడ్డి కాలేజీలో ఎంబీఏ చదివింది.
స్కూలుకు, తర్వాత కాలేజీకి వెళ్లొస్తున్నప్పుడు కాలనీలోని చర్చి బస్టాప్ దగ్గర గోడపై అంటించే సినిమా పోస్టర్లు ఈషాను అమితంగా ఆకట్టుకునేవి. ప్రతివారం అక్కడ మారే రంగురంగుల పోస్టర్లను ఆసక్తిగా చూసేది. బహుశా సినిమాపై ఆమెకు ఆకర్షణ అన్నది అప్పుడే మొదలై ఉంటుంది. కాలేజీలో మినీ ప్రాజెక్టులో భాగంగా హైటెక్ సిటీలోని ఇన్ఫోటెక్‌కు, జూబ్లీహిల్స్‌లోని టీవీ 5 చానల్‌కు వెళ్లేది. టీవీ 5లో ఉండగా కొందరు యాంకర్‌గా ట్రై చెయ్యమన్నారు. ఆమెది మొదట్నుంచీ ఇంగ్లీష్ మీడియం కావడంతో టెలీ ప్రాంప్టర్ మీద స్క్రోల్ అవుతున్న తెలుగు పదాలను గబగబా చదివేందుకు ఇబ్బంది పడేది. ప్రాక్టీస్ కోసం రోజూ తెలుగు పేపర్లు చదివేది. అయితే యాకరంటే కెమెరా ముందు గలగలా మాట్లాడాలి. అది తనవల్ల కాదనుకొని వెనక్కి తగ్గింది. అలా అని గ్లామర్ ఫీల్డుపై ఆకర్షణ మాత్రం పోలేదు.
టూ వీలర్‌పై ఇంటికి వెళ్తుంటే చందానగర్ సెంటర్‌లో పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన 'ఖుషి' హోర్డింగ్ ఆమెను కట్టిపడేసేది. ఎప్పటికైనా అలాంటి హోర్డింగ్‌పై తన బొమ్మ చూడాలనుకొనేది. హీరోయిన్ అయ్యాక అక్కడే తన ఫొటో చూసుకొని మురిసిపోయింది.
సినిమాల్లోకి అడుగుపెట్టాలంటే మోడలింగ్ విజిటింగ్ కార్డుగా పని చేస్తుందనిపించింది. దాంతో మోడలింగ్‌లో అవకాశాల కోసం యత్నించింది ఈషా. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, అంబికా దర్బార్ బత్తి లాంటి కొన్ని యాడ్స్ చేశాక తనపై తనకు నమ్మకం ఏర్పడింది. రిలయన్స్ కంపెనీ పలు భాషల్లో చేసే యాడ్ కోసం తెలుగులో ఈషాను సెలెక్ట్ చేశారు. అదే సమయంలో డెరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అంతకు ముందే నితిన్ హీరోగా చేసిన 'కొరియర్ బాయ్ కల్యాణ్' సినిమా కోసం ఆడిషన్ ఇచ్చింది కానీ, ఆ తర్వాత అక్కడ్నుంచి ఎలాంటి సమాచారం లేదు. అందుకే ఇంద్రగంటి నుంచి వచ్చిన ఆఫర్‌పై కూడా పెద్ద ఆశలు పెట్టుకోలేదు. పైగా ఫోన్ వచ్చినరోజే ఫ్యామిలీ అంతా షిర్డీ ప్రయాణానికి ప్లాన్ చేసుకున్నారు.
జర్నీకి ఇంకా టైమ్ ఉండటంతో ఈలోపు వెళ్లి కలిసొద్దామనుకుంది. ఆఫీసుకు వెళ్లాక టెస్ట్ షూట్ చేసి "నువ్వే హీరోయిన్‌వి" అన్నారు. అదే.. 'అంతకు ముందు.. ఆ తర్వాత' సినిమా. నటనలో ఆమెకు ఏమాత్రం అనుభవం లేకున్నా తొలి సినిమాతోటే మంచి గుర్తింపు వచ్చింది. మోహనకృష్ణ వరుసగా 'బందిపోటు', 'అమీ తుమీ' చిత్రాల్లో ఆమెకు అవకాశాలిచ్చి ప్రోత్సహించాడు. అమీ తుమీలో ఈషా తెలంగాణ యాస అందరికీ తెగ నచ్చేసింది.
ఆ తర్వాత దర్శకుడు, అ!, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీరరాఘవ, సుబ్రమణ్యపురం, రాగల 24 గంటల్లో సినిమాల్లో మంచి పాత్రలు చేసిన ఈషా.. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ 'పిట్ట కథలు'లో పింకీ పాత్రతో ఆకట్టుకుంది. ఇటీవలే 'ఒట్టు' మూవీతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.